విశ్వాసం, భక్తి మరియు దేవుడు

Share now!

విశ్వాసం, భక్తి మరియు దేవుడు

అసాధ్యమైన పరతత్వాన్ని సుసాధ్యం చేసేది భక్తి ఒక్కటే. పంచేంద్రియాలకు అందనంత దూరంలోఉన్న దైవాన్ని, ఇంద్రియాధీనుడైన మనిషి భక్తితోనే పొందగలడు. దైవం ఎంత దూరంలోఉన్నా- ఉన్నది మాత్రం భక్తుడి కోసమే. ఆయన చూపులన్నీ భక్తుడిపైనే. తపనంతా భక్తుడి క్షేమం కోసం. ఆర్తితో పిలిస్తే భువికి సైతం దిగివచ్చి, భక్తుడి ముందు వాలతాడు. సృష్టి పాలనకన్నా, భక్తుడి ప్రేమ మిన్నని భక్తుడికి దాసానుదాసోహం చేస్తాడు. తండ్రిగా పోషిస్తాడు. తల్లిగా లాలిస్తాడు. మిత్రుడై తోడుంటాడు. గురువుగా బోధిస్తాడు.

విశ్వాన్ని దైవం శాసిస్తే, దైవాన్ని భక్తుడు శాసిస్తాడు. కృష్ణావతారంలో అర్జునుడికి పరాధీనుడై అతడి స్నేహంకోసం తపించాడు. ఖాండవ దహనంలో అగ్నిని ఇదే కోరాడు. యుద్ధంలో రథసారథ్యానికి, చివరికి- పార్థుడి పాదాలచెంత కూర్చోవడానికి సిద్ధమయ్యాడు. దైవానికి ఉన్న ఈ బలహీనతే మనిషిని బలవంతుణ్ని చేసింది.

సర్వాంతర్యామి సొంతం కావాలంటే, మనసు భక్తి అనే మత్తును రుచి మరగాలి. దీని మాధుర్యం సుధారసంలో దొరకదు. పరమాత్మ మానవ పక్షపాతి కనుకే సురాసోమసుధారసాలు దేవతలకిచ్చి, భక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. విశ్వాసం అనే పువ్వులోని మకరందంలో దీన్ని మనిషి కోసం దాచాడు. భక్తికి దైవం మెట్టినిల్లయితే, విశ్వాసం పుట్టినిల్లు.

మానవ మేధకు అందని ఒక దివ్యశక్తి దైవం. అణువుకన్నా అణువైనది, మహత్తుకన్నా మహత్తు కలది. సంశయ సందేహాలతో కూడిన బుద్ధిని సమాధానపరచడం కష్టం. వేదవాక్కులను విజ్ఞుల బోధనలను సత్యప్రమాణంగా స్వీకరించి, దేవుడున్నాడని విశ్వసించడం ఒక్కటే మార్గం. స్వార్థరహితులు, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆధ్యాత్మిక మహనీయులు, మహావతార పురుషులు పరమాత్మ ఉనికిని తత్వాన్ని మార్గాన్ని బోధించారు. వారి బోధనల్ని త్రికరణశుద్ధిగా ఆచరించాలి.

‘దైవం, సర్వకాల సర్వావస్థలయందు నాకు తోడు. ఘోరారణ్యంలో ఉన్నా, ఆకాశంలో పయనిస్తున్నా, సముద్రంలో పెనుతుపాను మధ్య చిక్కుకున్నా దైవకృప నాపై ప్రసరింపక మానదు’ అనే నిర్భీతి విశ్వాసానికి నిదర్శనం. దేవుడున్నాడనే దృఢ భావనకు, దైవం ఉండవచ్చు అనే భావనకు చాలా తేడా ఉంది. దైవం ఉనికిని పూర్ణంగా విశ్వసిస్తేనే నిజభక్తి పుడుతుంది. దైవపూజ ఒక అలవాటుగా, ఆచారంగా, నిత్యకృత్యంగా చేస్తే మనసు సుశిక్షితమవుతుంది. అనుకున్నది జరిగితే నమ్మడం, లేకపోతే వేరే దైవాన్ని పట్టుకోవడం వ్యర్థం. దైవాన్ని రక్షణ, పోషణ, శిక్షణకోసం కాకుండా- పదవి కోసమో, ధనం కోసమో, కీర్తిప్రతిష్ఠల కోసమో అర్చిస్తే… నిరాశే మిగులుతుంది.

మనిషి నమ్మకంతో ఒక్క అడుగు ముందుకువేస్తే, దైవం ఆ నమ్మకాన్ని పదిలం చేసేందుకు పది అడుగులు వేస్తాడు. మొదటి అడుగు మాత్రం మనిషిదే కావాలి.

సినిమా కథ వింటున్నప్పుడు దర్శకుడి మదిలో ఊహాచిత్రాలు ఏర్పడతాయి. అవే చలనచిత్రాలవుతాయి. అలాగే దైవం గురించి మనిషి నిర్మించుకున్న ఊహాచిత్రాలే విగ్రహాలు, చిత్రపటాలు. గణితంలో ముఖ్యంగా బీజారేఖ గణితంలో ఉండేవన్నీ అనుభవమయ్యే భౌతిక విషయాలు కావు. ఇవి ఊహా సంజ్ఞలు అయినా అనంతవిజ్ఞానాన్ని మానవాళికి అందించాయి. అలాగే దైవం మానవ నిర్మితం, కల్పితం అనే భావనను విశ్వాసంతో జయిస్తే- భక్తిమాధుర్యాన్ని మనిషి పొందగలడు.

మనిషికి భక్తివిశ్వాసాలుంటే, దైవం కైలాస వైకుంఠాలకు బదులు భక్తుడి హృదయగుహలోనే తిష్ఠ వేసేందుకు మక్కువ చూపుతాడు!

🙏😇

Share now!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To make donations:
Donate with PayPal