పంచభూతాల పరోపకారం |Panchaboothala Paropakaram

Share now!

పంచభూతాల పరోపకారం |Panchaboothala Paropakaram

నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేవి పంచభూతాలు. ఇవి భూమండలాన్ని ఆవరించి ఉన్నాయి. ఇవి ఉన్నందువల్లనే మనిషి సుఖంగా జీవించగలుగుతున్నాడు.

ఇంతటి మహోపకారం చేస్తున్న పంచభూతాలకు మనిషి కృతజ్ఞుడై ఉండాలి. పంచభూతాలకు హాని చేయకుండా ఉండాలి. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తే భూమండలం స్వర్గధామం అవుతుంది. కలుషితం చేస్తే నరకంలా మారిపోతుంది.
పంచభూతాలకు మానవులపై అపార కారుణ్యం, దయ ఉన్నాయి. అందుకే మనిషి తమపట్ల అపచారం చేస్తున్నా, ఆకతాయితనంతో కీడు తలపెట్టినా పరమసహనంతో క్షమిస్తున్నాయి.
మనిషి మంచిగా మారకపోతాడా, అతడిలో వివేచన కలగకపోతుందా అని ఎదురుచూస్తున్నాయి. మనిషిలో మార్పుకోసం నిరీక్షిస్తున్నాయి. మనిషి సన్మార్గంలో నడవాలని కోరుకుంటున్నాయి.

నేలకు వసుంధర అని పేరు. వసువులు అంటే సంపదలు. వాటిని ధరించి ఉండేది కనుక భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది. నేలకోసం మనిషి తపిస్తాడు. నేలను సొంతం చేసుకొని, పసిడి పంటలు పండించాలనుకొంటాడు. నేలను ఆక్రమించి, ఆకాశహర్మ్యాలను నిర్మించాలనుకొంటాడు. నేలను జయించి సామ్రాజ్యాలను స్థాపించాలనుకొంటాడు. ఎన్ని చేసినా నేలను గెలవడం కష్టం. ఎంత నేలను ఆక్రమించినా, చివరికి మరణం తరవాత తనవెంట భూమిని తీసుకొనిపోలేడు.

నీరు మనిషికి ప్రాణాధారం. నీరు లేకుండా మనిషి బతకలేడు. ప్రపంచంలో అధికభాగాన్ని నీరే ఆక్రమించినా, పానయోగ్యమైన నీరు పరిమితమే. నీటిని స్వచ్ఛంగా ఉంచుకొనకపోతే, భవిష్యత్తు అగమ్యగోచరమే. నీరు మనిషిని కాపాడుతుంది కనుక నీటిని మనిషి కాపాడుకోవాలి. నీటికి జీవనం అనే పేరూ ఉంది. ఇది దీనికి సార్థక నామధేయమే. జలంలోనుంచే బ్రహ్మాండసృష్టి జరిగింది. చివరికి జలంలోనే సమస్తం లయమైపోతుంది. నారాలు అంటే నీళ్లు. వాటికి మూలమైనవాడు కనుక విష్ణువుకు నారాయణుడని పేరు.

మనిషికి నేల, నీరు ఎంత అవసరమో నిప్పూ అంతే అవసరం.

భూగోళానికి కావలసిన ఉష్ణం సూర్యుడి నుంచే వస్తుంది. నిప్పు మండాలన్నా సూర్యుడు ప్రకాశించవలసిందే. సూర్యుడు లేకుంటే భూమిపై నిప్పు పుట్టదు.

అగ్నిపర్వతాల రూపంలో భూగర్భంలో, బడబాగ్ని రూపంలో సముద్రాల్లో, సూర్యుడు నక్షత్రాల రూపంలో అంతరిక్షంలో తేజస్సు (నిప్పు) మండుతూనే ఉంది. ఇది మానవుల మనుగడకు ఉపయోగపడుతోంది.

మనిషిని బతికించే మరోశక్తి గాలి. ప్రాణవాయువు రూపంలో శరీరంలో, ప్రచండవాయు రూపంలో ప్రపంచంలో గాలి పుష్కలంగా లభిస్తుంది.

గాలి లేకుంటే శరీరంలో ప్రాణశక్తి నశిస్తుంది. జీవం నిర్జీవంగా మారుతుంది.

గాలివల్లనే రుతుగతులు ఏర్పడి వానలు కురుస్తున్నాయి.పంటలు పండుతున్నాయి. విద్యుత్తు వంటి శక్తులు ఉత్పన్నమవుతున్నాయి. భూగోళం చుట్టూ గాలిపొర ఉన్నందువల్లనే భూమిపై ప్రాణుల ఉనికి క్షేమంగా ఉంది.

ఆకాశం సర్వవ్యాప్తి. ‘ఇందుగలదందు లేదను సందేహము వలదు’ అన్నట్లు ఆకాశం సర్వత్రా వ్యాపించి, జీవుల మనుగడకు అవకాశం ఇస్తోంది. ఆకాశం వల్లనే మనిషి శబ్దాలను వినగలుగుతున్నాడు.

నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు అనంతాకాశంలో స్వేచ్ఛగా తిరుగుతూ అబ్బురపరుస్తున్నాయి. సూర్యోదయ, సూర్యాస్తమయాలు, చంద్రోదయ, చంద్రాస్తమయాలు, వర్షించే మేఘాలు, రాలిపడే ఉల్కలు…

అన్నీ ఆకాశం ఉన్న కారణంగానే సంభవిస్తున్నాయి.

పంచభూతాలు చరాచరాలకు ఎంతో ఉపకరిస్తున్నాయి.

వాటికి ఏ స్వార్థమూ లేదు. అన్నీ ఉచితంగా ప్రసాదిస్తున్న పంచభూతాలను మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు.

వాటి నైసర్గిక స్థితిని, స్వచ్ఛతను తన చేష్టలతో కలుషితం చేస్తున్నాడు.

తన శ్రేయస్సును సైతం కాలరాస్తున్నాడు. ఇది మనిషికి ఏమాత్రం వాంఛనీయం కాదు.🙏

Share now!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To make donations:
Donate with PayPal